ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దాదాపు అన్నింటికి అనుమతించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్ర అనుమతించే సర్వీసుల్లో లోకల్ రైళ్లు, మెట్రో సేవలు, ఆడిటోరియంలు, సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు ఉండనున్నాయి.
ఈ నెలాఖరుతో అన్ లాక్-3 ముగియనున్నది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ లాక్-4 అమల్లోకి రానున్నది. ఆర్థిక లావాదేవీల పెంపులో భాగంగా ఈ చర్యలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
లోకల్ రైళ్లు, మెట్రో రైళ్లు, సింగిల్ థియేటర్ సినిమా హాళ్లు, ఆడిటోరియం లు, అసెంబ్లీ హాల్స్ వంటివి అనుమతించాలంటూ కేంద్రానికి పలు రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు అందాయి. అయితే, వీటిని అనుమతించే విషయంలో ఇంకా కేంద్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
లోకల్ రైళ్ల ట్రాన్స్ పోర్టేషన్, సింగిల్ స్క్రీన్ హాళ్లను సామాజిక నిబంధనలతో అనుమతించేందుకు సుముఖంగానే ఉన్నారు. అలాగే ఆడిటోరియం, హాల్స్ విషంయంలోనూ సామర్థ్యం కంటే తక్కువ మందిని అనుమతించడం, సామాజిక దూరం నిబంధనలు తప్పనిసరి చేయనుంది.
కాగా, స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభించే విషయంలోనూ, వినోద పార్కులు, మల్టీ స్క్రీన్ మూవీ హాల్స్ విషయంలో ప్రభుత్వం కొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉండనుంది.