Politicla Eye

పేరోల్ పెళ్లిళ్లపై హైకోర్టు జడ్జీల ఆశ్చర్యం

చెన్నై: మద్రాస్ హైకోర్టులో విచిత్రమైన పిటీషన్ లు దాఖలైంది. అసలు ఇలాంటి పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయి, ఇదేం చోద్యం అంటూ హైకోర్టు జడ్జీలు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విధమైన పెళ్లిళ్లు సరైనవి కావని, విచారణ జరిపి నివేదిక అందచేయాలని జాతీయ మహిళా కమిషన్ ను ఆదేశించింది.

జైలులో యావజ్జీవ ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న తన భర్తకు పేరోల్ మంజూరు చేయాలంటూ ఒక మహిళ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై జడ్జీలు జస్టిస్ ఎన్.కృపాకరన్, వీఏం.వేలుమణి విచారించారు. నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఖైదీ అని తెలుసా? తెలిసే చేసుకున్నావా? అని అడిగారు. పెళ్లి చేసుకుంటున్నప్పుడు అతను ఖైదీ అని తెలియదని చెప్పడంతో జడ్జీలు ఆశ్చర్యపోయారు. హత్య కేసులో పేరోల్ పై వచ్చి తనను వివాహం చేసుకున్నాడని ఆమె వివరించింది.

మరో కేసులో అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పేరోల్ మంజూరు చేయాలని ఒక మహిళ పిటీషన్ వేసింది. ఖైదీ అని తెలుసుకుని వివాహం చేసుకున్నానని, పదేళ్ల క్రితం పేరోల్ పై వచ్చి తనను వివాహం చేసుకున్నాడని, అదేరోజు మళ్లీ జైలుకు వెళ్లాడని తెలిపింది. ఆ రోజు నుంచి అత్తారింట్లోనే ఉంటున్నట్లు చెప్పింది.
ఈ రెండు కేసులను విచారించిన జడ్జీలు మాట్లాడుతూ, ఖైదీలను వివాహం చేసుకునేందుకు ఏ మహిళ ముందుకు రాదని అన్నారు. ఇలాంటి పెళ్లిళ్లు మహిళల ఇష్టంతోనే జరుగుతున్నాయా, బలవంతంగా చేస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై లోతుగా విచారించి నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషనర్, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like