హైదరాబాద్: కరోనా వైరస్ ప్రారంభంలో ఉన్నంత తీవ్రంగా ఇప్పుడు లేదని సీసీఎంబీ డైరెక్టర్ డా.రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితం వైరస్ సోకగానే ప్రతి ఒక్కరిలో వ్యాధి లక్షణాలు కన్పించేవని అన్నారు. ఇప్పుడు 80 శాతం మందిలో కన్పించడం లేదన్నారు.
రోగ నిరోధక శక్తి ఉన్న చాలా మందికి వైరస్ సోకడం, దాన్నుంచి కోలుకున్న విషయం కూడా తెలియకుండానే వెళ్లిపోతున్నదన్నారు. వైరస్ బలహీనపడిందనే దానికి ఇదొక సంకేతమని రాకేశ్ మిశ్రా వివరించారు. గతంలో 50 శాతం మందికి శ్వాస సంబంధ సమస్యలు వచ్చేవని, ఇప్పుడు అంతగా రావడం లేదన్నారు.
ఇప్పటి వరకు హాంకాంగ్ లో మాత్రమే ఒక వ్యక్తికి రెండోసారి పాజిటివ్ వచ్చిందని, మిగతా దేశాల్లో వచ్చినట్లుగా చెబుతున్న దానిలో వాస్తవ లేదని రాకేశ్ మిశ్రా అన్నారు. హాంకాంగ్ లో 33 సంవత్సరాల వ్యక్తిగా తొలుత పాజిటివ్ సోకింది. కోలుకున్న తరువాత యూరప్ లో పర్యటించి తిరిగి హాంకాంగ్ వచ్చారు. విమానాశ్రయంలో పరీక్షించగా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
రెండోసారి వైరస్ రావడంపై లోతైన పరిశోధనలు జరగాలన్నారు. అయితే అందరికీ ఇలా సోకుతుందని భయపడవద్దని రాకేశ్ మిశ్రా సూచించారు. కోలుకున్నవారు రోగ నిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.