Politicla Eye

ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. షెడ్యూల్డు కులాలు, తెగల ఉపకులాల కోసం రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కులాల ఉప వర్గీకరణలో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించినట్టయింది. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల నుంచీ ఉద్యమం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు.. దీనికి బాటలు వేసినట్టయిందనే న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరింత లోతుగా విచారించి తీర్పునిచ్చేందుకు ఈ కేసును విస్తృతస్థాయి ధర్మాసనానికి బదలాయించారు.
ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై పంజాబ్ రాష్ట్రం నుంచి దాఖలైన ఓ పిటీషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. 2004లో ఈవి.చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్ హైకోర్టు విచారించకుండానే ఏకపక్షంగా కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కృష్ణ మురళీలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఎస్సీ, ఎస్టీల్లో కులాలవారీగా ఉప వర్గీకరణ చేపట్టాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఎక్కడా ప్రాధాన్యత తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఉప కులాలకు రిజర్వేషన్ ఏమాత్రం తగ్గించకుండా చట్టం చేసుకోవచ్చని సూచించింది. ఈవి.చెన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసుపై 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము విభేదిస్తున్నట్లు తాజాగా ధర్మాసనం పేర్కొనడం గమనార్హం. 2004లో ఈవి.చెన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని ధర్మాసనం స్పష్టం చేయడం సంచలనంగా మారింది. 2004లో సరైన నిర్ణయం తీసుకోకుండా అప్పటి ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చినట్లు తాము భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఇదే కనుక జరిగే దేశ వ్యాప్తంగా ఈ రెండు కులాల్లో వర్గీకరణ ఉద్యమాలసు మరింత ఉధృతం కావడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారనున్నది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like