అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదు. తమకు నచ్చిన విధంగా పాలన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 15 నెలలుగా సీఎం వైఎస్.జగన్ దర్శనం లభించకపోవడంతో సలహాదారు పదవికి కె.రామచంద్రమూర్తి రాజీనామా సమర్పించారు.
సచివాలయంలో ప్రధాన సలహాదారు కల్లం అజేయ రెడ్డికి రామచంద్రమూర్తి రాజీనామా పత్రం అందచేశారు. సీఎం తో కలిసే అవకాశం, చర్చించే అవకాశం కూడా లభించకపోవడంతో మనస్థాపానికి గురయ్యారని అంటున్నారు. రామచంద్రమూర్తి ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, హెచ్ఎంటీవీ లో వివిధ హోదాల్లో పనిచేశారు. వైఎస్.జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన తరువాత మూర్తిని సలహాదారు (పబ్లిక్ పాలసీ) గా నియమితులయ్యారు.
సలహాదారుడినైన తనకే అప్పాయింట్ మెంట్ లభించకపోతే ఈ పదవిలో ఉండడం ఎందుకు వృధా అని రాజీనామా చేశారనే వార్తలొస్తున్నాయి. ఈయన బాటలోనే మరికొందరు కూడా నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంటి నుంచే పాలన సాగిస్తూ, నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తున్నారు.