హైదరాబాద్: దర్శకులు రామ్ గోపాల్ వర్మ జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతున్నది. ఈ బయోపిక్ ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా ప్రకటించారు. మొదటి రెండు భాగాల్లో నటీ, నటులు నటిస్తుండగా, మూడో భాగంలో మాత్రం వర్మ నటించనున్నారు. తన చిత్రంపై ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నా జీవితంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఘటనలు చిత్ర యూనిట్ కు వివరించాను, వాళ్లు ఇప్పటికే నా గురించి పరిశోధన చేసి చాలా వరకు తెలుసుకున్నారన్నారు.
ముంబైలో 2008 సంవత్సరంలో జరిగిన పేలుళ్ల తరువాత నేను, హీరో రితేష్ దేశ్ ముఖ్ తాజ్ హోటల్ కు వెళ్లడం జరిగింది. ఆ హోటల్ లో ఏం చర్చించాం అనేది సినిమాలో చూపిస్తామన్నారు. వాస్తవంగా ఆ సమయంలో అక్కడికి వెళ్లడం తప్పు కాబట్టి ఆ విషయాన్ని నేనెప్పుడూ వెల్లడించలేదని వర్మ తెలిపారు.
మొదటి రెండు భాగాల సినిమా కన్నా ఫైనల్ భాగం సినిమాలో వివాదాలు, శృంగార సన్నివేశాలు ఉంటాయన్నారు. రంగుల ప్రపంచంలో విహరించాను, ఎన్నో అనుభవించానన్నారు. అమ్మాయిలతో ఉన్న సంబంధాలను కూడా బహిర్గతం చేసి చూపిస్తామని వర్మ వివరించారు.