లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది. పర్సన్ కంప్యూటర్ ఆవిష్కర్త, స్పిల్ బర్గ్ తండ్రి అర్నాల్డ్ స్పిల్ బర్గ్ (103) కన్నుమూశారు.
కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం లాస్ ఏంజెలెస్ లో తుది శ్వాస విడిచారని స్టీవెన్ స్పిల్ బర్గ్ ప్రకటించారు. ఉక్రెయిన్ యూదు వలసదారుల కుమారుడు అర్నాల్డ్ స్పిల్ బర్గ్ 1917లో సిన్సినాటీలో జన్మించాడు. ఆర్నాల్డ్ కు మొదటి నుంచి ఎలక్ట్రానిక్స్ అన్నా, గ్యాడ్జెట్లు అన్నా అమితాశక్తి కనబర్చేవాడు. తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే క్రిస్టల్ రేడియోను, పదేహేనేళ్లు వచ్చేనాటికి హమ రేడియోను తయారు చేశాడు. ఈ సాంకేతికత ఆయనకు రెండో ప్రపంచ యుద్దంతో బాగా అక్కరకు వచ్చింది.
అర్నాల్డ్ కు ముగ్గురు భార్యలు కాగా, నాలుగురు సంతానం కలిగారు. మొదటి సంతానం స్టీవెన్ స్పిల్ బర్గ్ (73), మిగతా ముగ్గురు అమ్మాయిలే. మొదటి భార్య లేహ్ 2017లో మూడవ భార్య 2016 లో చనిపోయారు. స్టీవెన్ తన తండ్రి మేథో సంపత్తిని గుర్తు చేస్తూ.. తొలినాళ్లలో కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తనకు వివరించేవాడన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లే స్టేషన్, మొబైల్ ఫోన్, ఐ ప్యాడ్ లాంటి వాటిని చూస్తే వీటన్నింటి వెనకాల తన తండ్రి లాంటి మేథావుల కృషి ఉందని గుర్తు చేసుకున్నారు. తన చిత్ర దర్శకత్వానికి కూడా తండ్రి ఎంతో సహకరించేవాడని స్టీవెన్ కొనియాడారు.