హైదరాబాద్: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు.
భారతదేశంలో ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం, అందరికీ ఆహారం అందిస్తున్న రంగం, పరిశ్రమలకు అత్యంత కీలకమైన ముడి సరుకును అందిస్తున్న రంగం వ్యవసాయ రంగమే అని సిఎం చెప్పారు. భారత దేశానిది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగుతున్నదని సిఎం అన్నారు.
నాబార్డ్ చైర్మన్ జి.ఆర్.చింతల, గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు బృందంతో సిఎం సమావేశమయ్యారు. వ్యవసాయ రంగం అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
‘‘భారతదేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరిన్ని కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయ దారులే. దీనికోసం నాబార్డు అధ్యయనం చేయాలి. వ్యవసాయం కూడా ఎటు పడితే అటు, ఎలా పడితే అలా నడుస్తున్నది. దేశంలో రకరకాల భూభాగాలున్నాయి. కొండ ప్రాంతాలు, శీతల ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలున్నాయని’’ సిఎం అన్నారు.
‘‘పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులను వ్యవసాయమే అందిస్తున్నది. పారిశ్రామికీకరణ కూడా జరగాలి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న మరో ముఖ్య సమస్య కూలీల కొరత. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి. నాటు వేసే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు, వరికోత యంత్రాలు, వివిధ పంటలు కోసే యంత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలి. దీనికి కూడా అవసరమైన ఆర్థిక సహాయం, సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉంది. ’’ అని సిఎం చెప్పారు. డిసిసిబి బ్యాంకులు మరింత సమర్థ వంతంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.