హైదరాబాద్: రాజేంద్ర నగర్ లో చిరుత పులి అటవీశాఖ సిబ్బందికి, అధికారులకు చుక్కలు చూపిస్తున్నది. నిన్న రాజేంద్ర నగర్ లో వాలంతరి రీసెర్చ్ ఫామ్ హౌస్ లో లేగదూడ పై దాడి చేసి తింటున్న సమయంలో పశువుల యజమాని శబ్దం చేయడంతో పారిపోయింది.
గత మూడు నెలల నుంచి చిరుత పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నది. పట్టుకునేందుకు ఇప్పటికే పలుమార్లు అటవీ సిబ్బంది ప్రయత్నించడంతో పాటు బోను లు కూడా ఏర్పాటు చేశారు. అయితే అది చిక్కకుండా తప్పించుకుంటున్నది. ముందు జాగ్రత్త చర్యగా అటవీ శాఖ అధికారులు చిరుతపులి జాడ కొనుక్కోడానికి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం సమయంలో లో ఫామ్ హౌస్ లో చనిపోయిన లేగదూడలు తెల్లవారి మాయం అయ్యాయి.
కచ్చితంగా చిరుతపులి తీసుకు వెళ్ళింది అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడానికి ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి వచ్చారు. చిరుత పులి కచ్చితంగా వాలంతరి ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు అని అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు.