విజయవాడ:కరోనా మహమ్మారిని ప్రైవేట్ హాస్పిటల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఆటోనగర్ లోని జయశ్రీ లిబర్టీ హాస్పిటల్ లో కోవిడ్ చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు.
చికిత్స పేరుతో ఇప్పటి వరకు రూ.15 లక్షలు బిల్లు కట్టించుకుని సరైన వైద్యం అందించలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లిబర్టీ హాస్పిటల్ నిర్లక్ష్యం పై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయవాడ పోలీస్ కమీషనర్, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుని భార్య సరళ మాట్లాడుతూ, తన భర్తను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి నుంచి ఇక్కడకు తీసుకువచ్చి చేర్పించామన్నారు. చేరే సమయంలో తొలుత రూ.6 లక్షలు కట్టించుకుని ఆ తరువాత విడతల వారీగా మొత్తం రూ.15 లక్షలు తీసుకున్నారు. ఆక్సిజన్ అందించేందుకు సి.పాప్ మెషిన్ ను మా చేతే కొనుగోలు చేయించారని ఆమె కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా సరైన వైద్యం అందించకుండా నా భర్త ప్రాణాలు తీశారని సరళ విమర్శించింది. డాక్టర్ల నిర్లక్ష్యం, వైద్య పరికరాల కొరత వల్లే ఆయన చనిపోయారని ఆమె తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు చనిపోతే… మెడికల్ రిపోర్ట్ లో ఐదు గంటలకు చనిపోయారని రాశారు. పేషేంట్ల ఆర్ధిక పరిస్థితి బట్టి ప్యాకేజీ లు వసూలు చేసి దోచుకుంటున్నారని సరళ ధ్వజమెత్తారు.