హైదరాబాద్: కేబుల్ టీవీ రంగంలో పేరొందిన వెంకటసాయి మీడియా సంస్థ అధినేత చెలికాని రాజశేఖర్ ఇవాళ ఉదయం గుండెపోటుతో చనిపోయారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి భోజనం చేసుకుని నిద్రపోయిన ఆయన తెల్లవారు జామున నిద్రలోనే చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏపీ, తెలంగాణలో సుమారు పది లక్షల కేబుల్ కనెక్షన్లను కలిగిన వ్యక్తిగా, హాత్ వే రాజశేఖర్ పేరొందిన ఆయన తన నెట్ వర్క్ ను గుజరాత్ టీవీ లింక్స్ కు విక్రయించారు. లావాదేవీలు పూర్తి కాకపోవడం, కోర్టు కేసుల కారణంగా రాజశేఖర్ కొద్దిరోజులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. హాత్ వే ను రాష్ట్రంలో ప్రముఖ నెట్ వర్క్ గా తీర్చిదిద్దారు. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో హాత్ వే కు తిరుగులేకుండా చేయడంలో ఆయన కీలకపాత్ర ఉంది. మృతదేహాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని సీతానగరం తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.