హైదరాబాద్: ఆగస్టు నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పివి.నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
అలాగే నెక్లెస్ రోడ్ కు పివి జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని, హైదరాబాద్ లో పివి మెమోరియల్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పివి నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక అని, భారత దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ప్రపంచం గుర్తించిన మహామనిషి అని దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు.