ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. రాజధాని అమరావతి మార్పునకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను్ సుప్రీంకోర్టు కొట్టేసింది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు విన్నది. ప్రభుత్వం ఏమైనా వాదనలు ఉంటే హైకోర్టులోనే విన్పించుకోవాలని ఆదేశించింది. ఈ కేసుపై హైకోర్టు విచారణ చేస్తున్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అమరావతిలో పరిపాలనా రాజధాని కొనసాగించే బదులు విశాఖపట్నం తరలించేందుకు అనుమతించాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ రాకేశ్ విన్నవించగా, అది కూడా కుదరని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏమైనా వాదనలు ఉంటే హైకోర్టులోనే విన్నవించుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్వకేట్ రాకేశ్ ను కోరింది.