కడప: పులివెందులలో దారుణం జరిగింది. అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించాడు. ఏకంగా ఎస్సైనే వాహనంతో ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఎస్సై తృటిలో తప్పించుకుని, మొత్తానికి నిందితుడిని అరెస్టు చేశారు.
కారులో మద్యం అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై గోపినాథ్ రెడ్డి శుక్రవారం పులివెందులలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అటువైపుగా వెళ్తున్న ఒక కారును ఆపేందుకు ఎస్సై ప్రయత్నించారు. అయితే కారును నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని నిలపకుండా ఎస్సైని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఎస్సై చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారు అద్దాలను పగులగొట్టి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాడు.
అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఆ కారును, అందులోని 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.